: సెలబ్రిటీల సమరంలో మన హీరోలదే గెలుపు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ లో తెలుగు నటులు హీరోలమని నిరూపించుకున్నారు. దుబాయిలో నిన్న జరిగిన మ్యాచులో ముంబై హీరోస్ పై తెలుగు వారియర్స్ విజయఢంకా మోగించింది. అక్కినేని అఖిల్(22) నాటౌట్, ఆదర్శ్(33) నాటౌట్, ప్రిన్స్(23) తదితరులు బ్యాటుతో చెలరేగి పోయారు. దీంతో 128 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో తెలుగు వారియర్స్ చేరుకుంది. బౌలింగ్ లోనూ మన హీరోలు సత్తా చూపారు. రఘు, నందకిషోర్ చక్కటి బౌలింగ్ తో శభాష్ అనిపించారు. రఘు నాలుగు ఓవర్లలో 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోగా, నందకిషోర్ నాలుగు ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ముంబై హీరోస్ ను 127 పరుగులకే కట్టడి చేయగలిగారు. ఈ విజయంతో తొలి మ్యాచులో పరాజయ భారాన్ని అధిగమించారు. ముంబై హీరోస్ లో మెరుపులు మెరిపించిన ఒకే ఒక్క హీరోగా అపూర్వ లఖియా గురించి చెప్పుకోవాలి. 30 బంతుల్లో 69 పరుగులు సాధించి తెలుగు వారియర్లకు చుక్కలు చూపించాడు. లఖియా పుణ్యమా అని ముంబై హీరోలు ఆ మాత్రమైనా స్కోరు సాధించగలిగారు.