: బిల్లును రూపొందించిన విధానం బాగాలేదు: అరుణ్ జైట్లీ
తెలంగాణ ముసాయిదా బిల్లును యూపీఏ ప్రభుత్వం రూపొందించిన విధానం సరిగాలేదని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై ఢిల్లీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఒకే ప్రాంత ప్రజల మనోభావాలను మాత్రమే లెక్కలోకి తీసుకుందని ఆయన తెలిపారు. సీమాంధ్రుల అనుమానాలను నివృత్తి చేయకుండా, అక్కడి ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా విభజన జరగడం సముచితం కాదని ఆయన అన్నారు.
గతంలో వాజ్ పేయి ప్రభుత్వం దేశంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు, విభజన వల్ల వారికి కలిగే లాభాలను సమర్థవంతంగా చెప్పగలిగామని తెలిపారు. ఆ తరువాతే హోం మంత్రి ఎల్.కే.అద్వానీ పూర్తి కసరత్తు చేసి మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పటికైనా మించిపోయినది లేదని రెండు ప్రాంతాల నేతలను పిలిచి సమగ్రంగా చర్చించి నీటి వాటాలు, ఉద్యోగ, ఉపాథి, విద్య, ఆర్థిక అంశాలపై వివరణ ఇచ్చి విభజించడం సరైన పద్దతి అని ఆయన అభిప్రాయపడ్డారు.