: బెంగాల్ అత్యాచార బాధితురాలికి ఇల్లు, ఉపాధిహామీ పని
పశ్చిమ బెంగాల్ అత్యాచార బాధితురాలిని ఊరిలోకి రానిచ్చేది లేదని గ్రామస్థులు ప్రతిన బూనటంతో ఆ గ్రామ సమీపంలోనే బాధితురాలికి ఇందిరా ఆవాస్ యోజన పథకం క్రింద ఓ ఇల్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించినట్టు పశ్చిమ బెంగాల్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా తెలిపారు. బాధితురాలు చదువుకోని కారణంగా ఉపాధిహామీ పని ఇప్పిస్తామని అన్నారు. ఆమెపై దాడి జరిగే అవకాశం ఉండడంతో ఆమెకు రక్షణ కూడా కల్పిస్తామని పంజా వెల్లడించారు. గత నెల 21న 13 మంది కీచకులు ఆమెపై అత్యాచారం చేసిన కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె నిన్న డిశ్చార్జ్ చేశారు. అక్కడి నుంచి ఆమెను ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంక్షేమ గృహానికి తరలించారు. ఆమెకు ఎలాంటి సహాయక చర్యలు కావాలి? అనే విషయంపై ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.