: చీటింగ్ కేసులో యశ్ బిర్లాకు లుకౌట్ నోటీసు
ప్రముఖ యువ పారిశ్రామికవేత్త యశ్ బిర్లాకు ఓ చీటింగ్ కేసులో లుకౌట్ నోటీసు జారీ అయ్యింది. అతడితో పాటు బిర్లా పవర్ సొల్యూషన్స్ పైన ఫిర్యాదులు వచ్చినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ముంబై పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) నుంచి ఈ నోటీసు జారీ చేశారు. తొలుత ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు 2013 డిసెంబర్ 31వ తేదీన ఈ కేసు నమోదు చేశారు. ముంబైలోని వర్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారవేత్తను బిర్లా పవర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోటి రూపాయల మేర మోసం చేసినట్లు కేసు నమోదైంది. ఫిక్స్ డ్ డిపాజిట్ కాలపరిమితి ముగిసినా కూడా.. తనకు సొమ్ము తిరిగి చెల్లించలేదని కేసు పెట్టాడు. అనంతరం ఈ కేసు ఈవోడబ్ల్యూ విభాగానికి బదిలీ అయ్యింది. ఇప్పటివరకు 28 మంది వరకు పెట్టుబడి పెట్టిన వారు ఈవో డబ్ల్యూను ఆశ్రయించారు. మొత్తం 20 కోట్ల రూపాయల మేర తమను మోసం చేశాడని బాధితులు పేర్కొన్నారు. ఈ కేసులో బిర్లా పవర్ మాజీ ఎండీ పీవీఆర్ మూర్తిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు యశ్ బిర్లాపై లుకౌట్ నోటీసును అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు పంపారు.