: సమస్యలపై పార్లమెంటును హోరెత్తిస్తాం: నామా నాగేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు, జాతీయ సమస్యలపై పార్లమెంటును హోరెత్తిస్తామని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాదులోని చంద్రబాబు నివాసం నుంచి మాట్లాడుతూ, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని భారత్ కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటులో ప్రశ్నిస్తామని ఆయన వెల్లడించారు.

దేశంలో విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్న నకిలీ నోట్లను అరికట్టాలని ఆయన అన్నారు. విదేశాల్లో వందల కోట్ల రూపాయల నల్ల డబ్బును దాచుకున్న నల్లకుబేరుల జాబితా బయటపెట్టాలని నామా డిమాండ్ చేశారు. అవినీతిని అరికట్టడానికి 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి బ్యాంకు ఖాతాల ద్వారానే లావాదేవీలు జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలని సూచించారు.

తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని.. అలాగని సీమాంధ్రకు అన్యాయం జరగరాదని స్పష్టం చేశారు. ఇరు ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బిల్లును తయారు చేయాలని కోరారు. దేశంలో వరుసగా సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకోవాలని పార్లమెంటులో కోరతామని నామా వెల్లడించారు.

  • Loading...

More Telugu News