: టికెట్టు ఒక్కటే.. కానీ, 300 సార్లు ఉచిత భోజనం!
విమాన ప్రయాణ టికెట్ తో మీరేం చేయగలరు? గమ్యస్థానం చేరుకోగలరు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఒక వ్యక్తి మాత్రం కాస్త ఢిఫరెంట్. ఈయన టికెట్ కొన్నది ప్రయాణం కోసమే! కానీ, ప్రయాణించలేదు. పోనీ క్యాన్సిల్ చేసి డబ్బులు వెనక్కి తీసుకున్నాడా? అదీ చేయలేదు. ఏం చేశాడు? బాగా వాడుకున్నాడు. ప్రయాణించకుండానే ఆ టికెట్ తో ఎంతగా లాభం పిండుకోవాలో అంతా జుర్రుకున్నాడు. సుష్టుగా 300 సార్లు అదే టికెట్ తో హై క్లాస్ భోజనం ఆరగించాడు. అదెలా?
చైనాలో ఒక వ్యక్తి ఈస్టర్న్ చైనా ఎయిర్ లైన్స్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నాడు. ఈ కంపెనీ టికెట్ కొంటే ఒక వెసులుబాటు ఉంది. టికెట్ ను రద్దు చేసుకుంటే పూర్తిగా డబ్బు వాపసు చేస్తారు. అంతేకాదు, ఆ టికెట్ పై మీల్స్ ఫ్రీ. ఇదే అతడికి కలిసి వచ్చింది. టికెట్ తో షాంఘైలోని జియాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి వీఐపీ లాంజ్ లో లభించే ఉచిత మీల్స్ ను సుష్టుగా లాగించాడు. బాగా నచ్చింది.
ఇదేదో బావుందనుకున్నాడేమో! తిన్న తర్వాత విమానమెక్కలేదు. ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. మరో రోజు ప్రయాణించేందుకు బుక్ చేసుకున్నాడు. ఆ టికెట్ తో మరోసారి భోజనం ఫ్రీ. ఇలా ఏడాదిలో 365 రోజులకు గాను.. 300 సార్లు చేశాడు. చివరిగా ఈయన గారి భోజన రహస్యాన్ని విమానాశ్రయంలోని సదరు ఎయిర్ లైన్స్ సంస్థ వారు గుర్తించి ఆ ప్రయాణికుడితో టికెట్ రద్దు చేయించి.. చేతిలో డబ్బులు పెట్టారు. ఈ భోజన ప్రియుడు మరో విమానాశ్రయాన్ని వెతుక్కుంటాడేమో!