: తెలంగాణ ఇచ్చి తీరుతాం.. సీమాంధ్రుల అభ్యంతరాలు మాకు తెలుసు: దిగ్విజయ్ సింగ్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తీరుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రుల అభ్యంతరాలు తమకు తెలుసని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభ్యంతరం తెలుపుతున్న విద్యుత్, నీరు, ఉద్యోగాల విషయంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని హామీ ఇస్తున్నానని తెలిపారు.
రాష్ట్ర విభజన విషయంలో అన్ని రాజకీయ పార్టీల ఆమోదాన్ని తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు, జగన్ లు తమ ఆమోదాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చారని ఆయన తెలిపారు. ఆ రెండు పార్టీలు మార్చుకున్న నిర్ణయాన్ని మీరెందుకు మార్చుకోలేరని అడిగిన ప్రశ్నకు, తాము ప్రజలకు మాట ఇస్తే దానిని అమలు చేస్తామని ఆయన తెలిపారు.