: ఆసియాలోనే అతిపెద్ద పెయింట్ ఫ్యాక్టరీ ఆంధ్రాలో ప్రారంభించడం ఆనందదాయకం: సీఎం కిరణ్
రాష్ట్రంలో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా.. పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ను అనువైన ప్రాంతంగా పారిశ్రామికవేత్తలు గుర్తిస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లా హిందూపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన బెర్జర్ వెంచర్ పెయింట్స్ ప్లాంటును ముఖ్యమంత్రి హైదరాబాదు నుంచే ప్రారంభించారు. హైదరాబాదు నగరంలోని హయత్ హోటల్ లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఆసియాలోనే అతి పెద్ద వాటర్ బేస్డ్ పెయింట్ ఫ్యాక్టరీని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం పట్ల సీఎం కిరణ్ ఆనందం వ్యక్తం చేశారు. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో 5,500 కోట్లతో బెర్జర్ పెయింట్ పరిశ్రమను స్థాపించటంతో కంపెనీ యజమానులను ముఖ్యమంత్రి అభినందించారు. పరిశ్రమలకు అనువైనవిగా మెదక్, ప్రకాశం, చిత్తూరు జిల్లాలను కేంద్రప్రభుత్వం గుర్తించిందని, ఈ ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ తదితరులు పాల్గొన్నారు.