: మలేసియాలో కరీంనగర్ వాసుల కష్టాలు!


బతుకుతెరువు కోసం మలేసియా దేశం వెళ్లిన కరీంనగర్ వాసులను ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి. కంపెనీ వీసా ఇస్తానంటూ నమ్మబలికిన ఏజెంట్ విజిటింగ్ వీసా ఇచ్చి మలేసియా పంపడంతో వారు.. పగలు దొంగతనంగా పనిచేస్తూ.. రాత్రిపూట అక్కడ అడవుల్లో తలదాచుకుంటున్నారు. వారు మీడియాతో ఫోన్ ద్వారా మాట్లాడి తమ కష్టాలను ఏకరవు పెట్టుకున్నారు. మలేసియాలో చిక్కుకున్న యువకులు భారత్ రాలేక, అక్కడ ఉండలేక అవస్థలు పడుతున్నారు. వీరి పాస్ పోర్టులు తిరిగి ఇచ్చేందుకు ఏజెంట్ మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని వారు వాపోయారు. ప్రవాసాంధ్ర శాఖ వారు స్పందించి తమను విముక్తులను చేయాలని వారు వేడుకుంటున్నారు. స్వదేశానికి పంపిస్తే.. ఇక్కడే ఉపాధి చూసుకుంటామని వారు చెప్పారు.

కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండల పరిధిలోని వెంకట్రావుపేట, మరిమడ్ల, కోనరావుపేట ప్రాంతాలకు చెందిన 15 మంది మలేసియా నుంచి వచ్చిన ఏజెంట్ కు 80 వేల రూపాయల చొప్పున చెల్లించారు. కంపెనీలో ఉద్యోగం, మంచి జీతమని నమ్మించి ఏజెంట్ వారిని 2012 అక్టోబరులో మలేసియా తీసుకెళ్లాడు. మలేసియాలో వారి పాస్ పోర్టులు తీసుకుని కంపెనీలో విడిచిపెట్టాడు. రెండు నెలల పాటు పనిచేసిన తర్వాత వీసాల గడువు ముగిసిందని చెప్పి కంపెనీ నుంచి వెళ్లగొట్టారు. బయటకు వచ్చిన వారు ఏదైనా పని చేసుకుందామంటే మలేసియా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విజిటింగ్ కోసం వచ్చిన వారు వెంటనే తిరిగి స్వదేశానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే పాస్ పోర్టు లేకపోవడంతో.. కూలీ పనులు చేసుకుంటూ ప్రస్తుతం పొట్టపోసుకుంటున్నారు. గదుల్లో ఉంటే పోలీసులకు దొరుకుతామని భయపడి రాత్రిపూట సమీప అడువుల్లో ఉంటూ కాలం గడుపుతున్నారు.

  • Loading...

More Telugu News