: అనూహ్య హత్య కేసులో వీడుతున్న మిస్టరీ!
కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో ఇప్పుడిప్పుడే మిస్టరీ వీడుతున్నట్లుగా కనిపిస్తోంది. ముంబయి లోక్ మాన్య తిలక్ టెర్మినల్ సీసీ ఫుటేజీని దర్యాప్తులో నిశితంగా పోలీసులు పరిశీలించారు. రైలు దిగిన తర్వాత ఆమె ఒక వ్యక్తితో వెళ్లినట్లు గుర్తించారు. అతడు తెలిసిన వ్యక్తే అని, ఏపీకి చెందిన యువకుడని పోలీసులు అనుమానించారు. వెంటనే ఎవరన్నది ఆరా తీసిన ముంబయి కుర్లీ జీఆర్ పీ పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయాలు బయటికి వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. అనూహ్య అదృశ్యం అనంతరం పదకొండు రోజుల తర్వాత ముంబయిలోని ఓ నిర్జన ప్రదేశంలో ఆమె మృతదేహం దొరికింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ఆమె తండ్రి ఇటీవల కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసి ఫిర్యాదు చేశారు. అప్పటినుంచీ కేసు దర్యాప్తు వేగవంతం అయింది.