: సీమాంధ్ర ఎమ్మెల్యేల పక్కా స్కెచ్.. ఏకమైన పార్టీలు.. వలలో పడ్డ టీనేతలు!
ఈ రోజు అసెంబ్లీలో టీబిల్లును సభలో మూజువాణి ఓటుతో తిరస్కరించే ముందు, తిరస్కరణ సమయంలో భారీ డ్రామా నడిచింది. సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ (కాంగ్రెస్, టీడీపీ, వైకాపా) ఏకమై పక్కా స్కెచ్ తో తెలంగాణ నేతలను అడ్డుకుని సభను నడిపించారు. ప్లాన్ ప్రకారం సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ స్పీకర్ రాకముందే స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. వీరంతా మూడు వరుసల్లో నిలుచున్నారు. మొదటి వరుసలో మహిళా ఎమ్మెల్యేలు, రెండో వరుసలో యువ ఎమ్మెల్యేలు, మరో వరుసలో ఇతరులు నిలబడ్డారు. వీరంతా స్పీకర్ పోడియంను ఆక్రమించి తెలంగాణ నేతలు అక్కడకు చేరుకునే పరిస్థితి లేకుండా చేశారు. ఎన్ని గంటలైనా సభలోనే ఉండాలని వీరంతా నిర్ణయించారు.
ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలెవరూ ముందుగా పసిగట్టలేకపోయారు. అయితే చివర్లో అలర్టయిన టీఆర్ఎస్ నేత హరీష్ రావు బెంచీల మీదుగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లబోయారు. అయితే, వలయంగా నిలబడ్డ మహిళా ఎమ్మెల్యేలు ఆయన కాళ్లు పట్టుకుని కిందకు లాగారు. దీంతో ఆయన కిందకు పడిపోయారు. హరీష్ తో పాటు స్పీకర్ పోడియంలోకి వెళ్లాలనుకున్న టీనేతలందరి పరిస్థితీ ఇంచుమించు ఇదే. రాంరెడ్డి దామోదరరెడ్డిని మంత్రి పార్థసారథి గట్టిగా పట్టుకున్నారు. లింగయ్య గౌడ్ ను ఉగ్రనరసింహారెడ్డి కదలకుండా చేసేశారు. ఈ నేపథ్యంలో క్షణ కాలంలోనే.... ఏదో కలలో జరిగినట్టు విభజన బిల్లు తిరస్కారానికి గురయింది.