: సీఎం, స్పీకర్ ఇక రాజకీయ సన్యాసమే.. మేం అనుకున్నది సాధించాం: ఎర్రబెల్లి
శాసనసభలో స్పీకర్ చర్చ పూర్తి చేసి రాష్ట్రపతికి, ఢిల్లీకి పంపనున్న బిల్లు ఆమోదం పొందినట్టేనని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, సీఎంకు, స్పీకర్ కు రాజకీయ సన్యాసమే మిగిలి ఉందని అన్నారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించిన ఆయన, సీమాంధ్రులను ఉరికించే సత్తా ఉన్నా తాము ఓపిక వహించామని అన్నారు. వారు గెలుపు అనుకోవడానికి లేదని, బిల్లుపై చర్చ జరగనీయాలన్నదే తమ ప్రధానోద్దేశమని, దానిని పూర్తి చేసి బిల్లును విజయవంతంగా ఢిల్లీకి పంపామని ఆయన అన్నారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని, వెయ్యిమంది అమర వీరుల త్యాగఫలానికి శాసనసభ సభ్యులు ఇచ్చిన నీరాజనమని ఆయన అన్నారు. స్పీకర్, సీఎంలు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన స్పష్టం చేశారు.