: గూట్లో.. రూ. 30వేలు పోగేసిన ఎలుక!
అనగనగా ఒక ఎలుక. ఎలుకకు పంటి దురద అని తెలుసు కదా? మరి, అందుకే అది ఊరికే కూర్చోలేదు. పంటికి పని చెప్పింది. మిగతా ఎలకల్లా కాకుండా కాస్త మెదడును కూడా వాడుకుంది. ఓ షాపులో క్యాష్ పెట్టెపై కన్నేసింది. రోజూ వ్యాపారి దుకాణం కట్టేసి ఇంటికెళ్లిన తర్వాత చోర ఎలుక తన కలుగులోంచి బయటకు రావడం.. జరజరజర మనుకుంటూ గల్లాపెట్టెలోకి దూరేయడం.. చక్కగా కరెన్సీ నోట్లను పుచ్చుకుని తన కన్నం లోపలకు తీసుకు వెళ్లడం.. ఇదే దాని దిన చర్య!
రోజూ కొన్ని నోట్లు మాయం అవుతుండడంతో వ్యాపారికి ఏమీ అర్థం కాలేదు. కొంత కాలం గడిచింది. ఓ రోజు వ్యాపారి షాపు తెరచిన వెంటనే ఎలుక గల్లా పెట్టె దగ్గర నుంచి పారిపోతుండడం చూశాడు. దాన్ని జాగ్రత్తగా గమనించి అదెటు వెళుతుందో చూశాడు. దాని కలుగు దగ్గరకు వెళ్లి చూడగా బయట నోటు కనిపించింది. ఇదంతా ఎలక పనా? అనుకున్న ఆ వ్యాపారి కలుగును తవ్వి చూడగా.. కళ్లు గిర్రున తిరిగాయి. అన్నీ నోట్లే. లెక్కేస్తే 30వేల రూపాయలు. అందులో 5వేల రూపాయల విలువకు సరిపడా నోట్లు ముక్కలు ముక్కలైపోయాయి. ఇంతకీ ఇది కథ కాదు. మన రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా తూపిలిపాళెంలో జరిగింది. ఆ వ్యాపారి పేరు నాగరాజు. ఇలాంటి చిత్ర, విచిత్రాలు కొన్ని అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటాయి!