: మీకు తెలియకుండానే కేంద్రం సమాచారం సేకరించిందా? : ముఖ్యమంత్రికి చంద్రబాబు సూటి ప్రశ్న


'కేంద్రం రాష్ట్రాన్ని అధిగమించడానికి హక్కు లేదు. అలాంటప్పుడు సీఎం తనకు తెలియకుండానే బిల్లు రాష్ట్రానికి వచ్చిందని ఎలా అంటారు? ఆయనకు తెలియనప్పుడు రాష్ట్రానికి చెందిన సమాచారం కేంద్రానికి ఎలా వెళ్ళింది?' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని శాసనసభలో నిలదీశారు. దీనిపై సీఎం స్పందిస్తూ, కేంద్రం సమాచారం అడిగిందని, దానికి సమాచారం ఇవ్వాలని ఛీఫ్ సెక్రటరీకి తాను చెప్పానని అన్నారు. ఈ బిల్లును పార్లమెంటుకు పంపించాలని రాష్ట్రపతి అంటున్నారని అంటే, జరుగుతున్నది ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి తనకు తెలియకుండానే విభజన జరుగుతోందని అన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఎం స్పీచ్ సందర్భంగా తెలుస్తోందని చంద్రబాబు అన్నారు. రాజ్యాంగంలో చెప్పినట్టు రాష్ట్రం అధికారాలను కేంద్రం చేతిలోకి తీసుకోకూడదని బాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య బద్ధంగా బిల్లును వ్యతిరేకిస్తుంటే, కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన మండిపడ్డారు.

బిల్లు తయారవుతున్నప్పుడే ఎందుకు అడ్డుకోలేదని బాబు ప్రశ్నించారు. పార్టీని, వ్యక్తులను కానీ టార్గెట్ చేసేందుకు బిల్లు పెట్టడం సరికాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం, తెలుగు జాతి కోసం ఎవరు ఉన్నారో తాను సోమవారం స్పష్టం చేస్తానని బాబు తెలిపారు. సభలో అందరూ తనను లక్ష్యం చేసుకునే మాట్లాడారని, అందరికీ సరిపడా సమాధానం సోమవారం ఇస్తాననీ బాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సమాచారం పంపించినంత మాత్రాన తాను విభజనకు అనుకూలం కాదని, తన అభిప్రాయం మాత్రం సమైక్యరాష్ట్రమేనని అన్నారు.

  • Loading...

More Telugu News