: రాష్ట్రానికి ఒరిజనల్ బిల్లు పంపించాలి... డ్రాఫ్టు బిల్లు పంపకూడదు: సీఎం
రాష్ట్ర విభజన జరిపేటప్పుడు రాష్ట్రానికి ఒరిజినల్ బిల్లు పంపించాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. రాజ్యంగం ప్రకారం రాష్ట్రానికి డ్రాఫ్టు బిల్లు పంపే సంప్రదాయం లేదని, అయినప్పటికీ కేంద్రానికి అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. విభజిస్తే రెండు రాష్ట్రాలు అవుతాయనీ, 371డి ని అమలు చేస్తామని కేంద్రం చెబుతోందని, అది తప్పని ఆయన అన్నారు. 371 డీ అంటే 80 శాతం జిల్లా ఉద్యోగాలు లోకల్ కి, మిగిలిన 20 శాతం మెరిట్ ఆధారంగా నాన్ లోకల్ కి చెందుతాయనీ, అప్పుడు ఉద్యోగాలు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దృష్ట్యా, దేశ భవిష్యత్ దృష్ట్యా విభజన మంచిది కాదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పాటుపడాలి కానీ, ముక్కలు చేయడం సరికాదని పీవీ నరసింహారావు తెలిపారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తాను సమైక్యవాదం కంటే కూడా తాను కాంగ్రెస్ వాదినని సీఎం స్పష్టం చేశారు. అయినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఆయన అన్నారు.
తన తండ్రి కూడా జై ఆంధ్రాకు మద్దతివ్వలేదని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సహా, ఎవరు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తామన్నా తాను మద్దతుపలకలేదని, వారి వాదనని అడ్డుకున్నానని తెలిపారు. తన తండ్రి పోయినప్పుడు కలిగిన బాధే రాష్ట్రం ముక్కలౌతుందంటే కూడా కలుగుతోందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.