: అక్కినేని లేరు..ఇక నేనూ ఉండను: ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ
కస్తూరి శివరావుకు తాను అసిస్టెంట్ నని.. ఆఫీస్ బాయ్ గా కెరీర్ ప్రారంభించానని.. తనకు ఏఎన్నార్ ను సినీ రంగానికి పరిచయం చేసే అదృష్టం కలిగిందని ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ తెలిపారు. తాను నాగేశ్వర రావును సినీ రంగానికి తీసుకువచ్చానని అన్నారు. దాసరిని, కోడి రామకృష్ణలను పరిచయం చేశానని అన్నారు. ఈయన కథలు అడుగుతాడని తనని ఎవరూ ఇష్టపడేవారు కాదని ఆయన అన్నారు. ఎల్వీప్రసాద్ తనకు ఏఎన్నార్ ను పరిచయం చేశారని తెలిపారు. తనకు ఏ జన్మ పుణ్యమో అంతటి మహానుభావుడ్ని సినీరంగానికి పరిచయం చేసే అవకాశం కలిగిందని ఆయన అన్నారు.
ఏఎన్నార్ ఏనాడు డబ్బు ఎంతిస్తావని అడగలేదని రాఘవ తెలిపారు. తనకు వందేళ్లు పూర్తయినప్పుడు 'సన్మానం చేస్తాను రాఘవ' అని ఏఎన్నార్ అన్నారని గుర్తు చేసుకున్నారు. తనకు జీవితంలో ఎప్పుడూ ఏడుపు రాలేదని, ఇప్పుడు ఏడుపు వచ్చిందని ఆయన అన్నారు. మరో పదేళ్లు ఏఎన్నార్ గారు బతుకుతారని అనుకున్నానని, అలాంటి ఆయన లేకపోవడంతో తాను మరో నాలుగు రోజులు బతుకుతానేమో అని ఆయన చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు.