: బ్లేజర్ కొనే స్థాయి లేక స్వెట్టర్ వేసుకుని వెళ్లా: ఆర్బీఐ గవర్నర్
ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తన అనుభవాలను వివరించి, తాను చదువుకున్న పాఠశాల విద్యార్థుల్లో స్పూర్తిని నింపారు. ఢిల్లీ ఆర్కేపురంలో తాను చదువుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూలును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు. తాను స్కూలులో చదువుకునే రోజుల్లో తన తండ్రికి బ్లేజర్ కొనిచ్చే ఆర్థిక స్థోమత లేదని, అందుకే స్కూలు యూనిఫాంలో భాగమైన బ్లేజర్ కొనివ్వలేకపోయారని.. దాంతో తాను ఎప్పుడూ స్వెట్టర్ ధరించి స్కూలుకు వెళ్లేవాడినని తెలిపారు. అందుకు తానెప్పుడూ చిన్నబుచ్చుకోలేదని, పట్టుదలతో చదివి ఉన్నత స్థితికి చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
ఆ రోజుల్లో తమకు ఇంజనీరింగ్, మెడిసిన్ తప్ప మరో అవకాశం ఉండేది కాదని, ఉన్నా తెలిసేది కాదని రాజన్ అన్నారు. నేటి తరం విద్యార్థుల ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, అభిరుచులకు అనుగుణంగా ఎంచుకునేందుకు ఎన్నో వృత్తులు ఉన్నాయని అన్నారు. అయితే ప్రతి అవకాశంలోనూ సవాళ్లు ఉంటాయని... పట్టుదలతో కష్టపడి, నిజాయతీగా కృషి చేస్తే విజయం సాధించవచ్చని ఆయన సూచించారు. తాజా అవకాశాల నేపథ్యంలో పోటీ బాగా పెరిగిందన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలని ఆయన సూచించారు.