: తాజ్ మహల్ ను శుక్రవారమూ తెరవడంపై వ్యతిరేకత
శుక్రవారం కూడా సందర్శకులను తాజ్ మహల్ చూసేందుకు అనుమతించాలని అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. గతంలో వారంలో అన్ని రోజులూ సందర్శకులను అనుమతించేవారు. 1993లో ఎస్ వరదరాజన్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ వారంలో ఒకరోజు తాజ్ మహల్ కట్టడానికి విశ్రాంతి కల్పించాలని సిఫారసు చేసింది. దాంతో వారంలో శుక్రవారం మాత్రం సందర్శకులను అనుమతించడం లేదు. కానీ, తాజాగా తీసుకున్న నిర్ణయం ఆ అపురూప కట్టడానికి చేటు చేస్తుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సందర్శకుల సంఖ్యను కట్టడి చేయాలని బ్రిజ్ మండల్ వారసత్వ సంపద పరిరక్షణ సొసైటీ అధ్యక్షుడు సురేంద్రశర్మ డిమాండ్ చేశారు. వారసత్వ కట్టడాన్ని ఎందుకు విధ్వంసం చేస్తారని ప్రశ్నంచారు. అయితే, తాజా నిర్ణయానికి యూపీ ప్రభుత్వం ఇంకా అనుమతించాల్సి ఉందని అధికారులు అంటున్నారు.