: ఇది చాలా కలతపెట్టే వార్త: సుప్రీంకోర్టు
పరాయి కులస్తుడిని ప్రేమించి జరిమానా కట్టనందుకు గ్రామ పంచాయతీ పెద్దలు.. ఒక యువతిపై 12 మందితో అత్యాచారం చేయించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దీన్ని సుమోటో కేసుగా విచారణకు తీసుకుంది. చాలా కలతపెట్టే వార్తగా దీన్ని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో వారం రోజుల్లో తమ ముందు నివేదిక ప్రవేశపెట్టాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో బీర్బుమ్ జిల్లా జడ్జిని సంఘటనా ప్రదేశాన్ని సందర్శించి వారంలో నివేదిక ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఇప్పటికే జిల్లా పోలీసు బాస్ ను తప్పిస్తూ ఆదేశించారు. పోలీసులు గ్రామ పంచాయతీ పెద్ద సహా 13 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారు.