: సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం సరికాదు: హరీష్ రావు
ముఖ్యమంత్రి ప్రసంగంపై పలువురు శాసనసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన విషయంలో కేంద్రప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని గతంలో సీఎం సభలో చెప్పిన విషయాన్ని టీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు గుర్తు చేశారు. అయితే, ఇవాళ మాత్రం సీఎంగా ఉండటమే దురదృష్టకరమని చెప్పడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. గౌరవనీయ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం సరి కాదని కూడా హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తి కాలేదని, గురువారం కూడా సీఎం సభలో ప్రసంగిస్తారని, సభ్యులేమైనా మాట్లాడదలిస్తే.. రేపు ప్రసంగం పూర్తయిన తర్వాతే వారి అభిప్రాయాలను చెప్పాలని సభాపతి నాదెండ్ల సభ్యులకు సూచించారు.