: బుల్లి గ్యాస్ సిలిండర్ వచ్చేసింది
బుల్లి గ్యాస్ సిలిండర్ మార్కెట్లోకి వచ్చేసింది. అవును.. ఐదు కిలోల బరువున్న ఈ కొత్తరకం గ్యాస్ సిలిండర్లను ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ విడుదల చేశారు. ఇంత వరకూ గృహ అవసరాల నిమిత్తం సుమారు 14 కిలోల సిలిండర్ వినియోగంలో ఉన్న విషయం విదితమే. సబ్సిడీపై ఈ సిలిండర్లను వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుత తరుణంలో, నగర వాసులకు కొత్త కనెక్షన్ కావాలంటే ఆధార్ కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఇంటి చిరునామా గుర్తింపు కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. తాజాగా ఐటీ, బీపీవో ఉద్యోగులు తరచుగా నగరాలకు బదిలీ అవుతున్నారు. వారికి గ్యాస్ డీలర్స్ ను కలిసి ఎప్పటికప్పుడు చిరునామా మార్చుకోవడం కష్టమవుతోంది.
ఈ ఇబ్బందులేమీ లేకుండా.. ప్రెటోల్ బంకుల్లోనే ఈ చిన్న సిలిండర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అయితే వీటి వినియోగదారులకు ఎలాంటి సబ్సిడీ ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందే స్పష్టం చేసింది. ఇంతకు ముందు బెంగళూరు నగరంలో ప్రవేశపెట్టిన ఈ సిలిండర్లు జనాదరణ పొందడంతో ఇప్పుడు ఢిల్లీలోనూ అందుబాటులోకి తీసుకువచ్చారు.