: గుడారాల్లో ప్రభుత్వ ఆఫీసులు నడిపారు: కేటీఆర్
మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న పరిస్థితులను కేటీఆర్ సభలో వివరించారు. ఆనాడు కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు గుడారాల్లో ప్రభుత్వ ఆఫీసులు నడిపారన్నారు. దాంతో, ఎప్పుడు హైదరాబాద్ వెళతామా? అని నీలం సంజీవరెడ్డి చెప్పారన్నారు. అయితే, అనాడు ఎన్నో హామీలు ఇచ్చి తెలంగాణను కలుపుకున్నారన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి బాధ్యత తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ చెప్పిందన్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజలు వ్యక్తం చేసిన భయాలు నిజమయ్యాయని, అందుకే ప్రజలు విభజన కోరుకుంటున్నారని వివరించారు. ఇప్పుడు కలిసి ఉండేందుకు కారణాలు చెప్పమని అడిగితే శేష ప్రశ్నగా మిగిలిపోయిందన్నారు.
ఒక రాష్ట్రం, ఒక భాష అని అంబేద్కర్ చెప్పిన మాటలను ప్రస్తావించిన కేటీఆర్... ఒక భాష మాట్లాడేవారికి ఎక్కువ రాష్ట్రాలు ఉండకూదని ఎక్కడా లేదన్నారు. మొదటి ఎస్సార్సీలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రస్తావన లేదని తెలిపారు. భాషా ప్రయుక్తంగా 1936లోనే ఒడిశా ఏర్పడిందని చెప్పారు. స్వాతంత్య్రానికి పూర్వం ఆంధ్ర అన్న పదాన్ని తెలుగుకు పర్యాయపదంగా వాడారని కేటీఆర్ పేర్కొన్నారు.