: అనూహ్య హత్య కేసులో విచారణను వేగవంతం చేయండి: మహారాష్ట్రకు సీఎం కిరణ్ విజ్ఞప్తి
కృష్ణాజిల్లా బందరుకు చెందిన ముంబై ఐటీ ఉద్యోగి అనూహ్య ఎస్తేర్ హత్య కేసులో విచారణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చౌహాన్ ను కోరారు. అనూహ్య ఇటీవల ముంబైలో దారుణ హత్యకు గురి కావడం తమ ప్రభుత్వాన్ని ఎంతో కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. చౌహాన్ తో ముఖ్యమంత్రి ఫోనులో మాట్లాడారు. ఈ హత్యోదంతంపై ఉన్నతస్థాయి పోలీసు అధికారుల చేత ప్రత్యేకంగా దర్యాప్తు చేయించాలని, ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నిందితులను గుర్తించి, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కిరణ్ చెప్పారు. అనూహ్య తండ్రి జోనాథన్ సురేంద్ర ప్రసాద్ కు సీఎం కిరణ్ ఆదివారం ఫోన్ చేసి పరామర్శించారు. ఈ హత్యోదంతం తమకెంతో బాధ కలిగించిందని, ఆమె మృతికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.