: బతికున్న వ్యక్తిని 'చంపేసిన' వార్తాపత్రిక
ఆ పెద్దాయన వయసు 81 ఏళ్లు. ఆయన అనారోగ్యంతో స్వీడన్ దేశంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. స్వెన్ సన్ అని పేరున్న ఆయనకు పొద్దున్నే పేపర్ చదవడం అలవాటు. ఉదయాన్నే పేపర్ చేతిలోకి తీసుకున్న స్వెన్ సన్.. తాను మరణించినట్లు వార్తా ప్రకటన రావడంతో ఆయనకు ‘దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్’ అయింది. ఆ వెంటనే తేరుకున్న ఆయన, ఈ ఘటనని తేలిగ్గా తీసుకొన్నాడు. స్వీడన్ లోని సదరు పత్రికా కార్యాలయానికి ఫోన్ చేసి, తానింకా జీవించే ఉన్నానని, కాబట్టి మర్నాడు సవరణ వేయాల్సిందిగా కోరారు. అంతేకాదు, తనను ఇంటర్వ్యూ చేసేందుకు ఓ రిపోర్టరును పంపాల్సిందిగా ఆయన కోరాడు.
ఇంతకీ ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలుసా! స్వెన్ సన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వైద్యులకు ఆయన సోదరి ఫోన్ చేసింది. తన అన్న క్షేమ సమాచారాన్ని తెలపాల్సిందిగా కోరింది. డాక్టర్లు చెప్పిన సమాచారాన్ని విని కంగారు పడిపోయిన ఆమె.. ఆయన చనిపోయాడనుకొంది. అంతేకాదు.. తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ పత్రికలో ప్రకటన ఇచ్చేసింది.