: అలాంటప్పుడు ఓటింగ్ అంటే భయమెందుకు? : పయ్యావుల
శాసనసభ తెలంగాణ బిల్లును తిరస్కరించినా, ఓడించినా బాధ లేదన్నప్పడు ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నప్పుడు పదే పదే ఎందుకు అడ్డుతగులుతున్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ నిర్ణయం జరిగిపోయిందని..శాసనసభలో ఏం జరిగినా పర్లేదు అంటున్న తెలంగాణ నేతలు, చర్చలో చెబుతున్న నిజాలను ఎందుకు తట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు.
నిర్ణయం జరిగిపోతే నిశ్చింతగా ఉండండి, భయమెందుకు? అని ఆయన తెలిపారు. ఆర్టికల్ 3పై చాలా మంది మాట్లాడుతున్నారని, అవన్నీ అవగాహన లేని వ్యాఖ్యలేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు చాలా సంప్రదింపుల తరువాత జరిగిందని ఆయన అన్నారు. అందులో భాగంగా దార్ కమిటీ, నెహ్రూ, వల్లభాయ పటేల్, పట్టాభిరామయ్యల కమిటీ, ఫజుల్ అలీ కమిటీల ఆమోదం తరువాత.. శాసనసభలో మెజారిటీ సభ్యుల ఆమోదంతోనే సువిశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని ఆయన గుర్తు చేశారు.
మరి కొంత మంది పంజాబ్ లాగే రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారని అంటున్నారని, అయితే పంజాబ్ ను రాత్రికి రాత్రే రాష్ట్రపతి పాలన పెట్టి, కేంద్రం విడదీసి పారేయలేదని ఆయన అన్నారు. ముందుగా రాష్ట్ర అసెంబ్లీ నుంచి అభిప్రాయం అడిగారు. అక్కడ ఏకాభిప్రాయం కుదరకపోయి..అసెంబ్లీలో ఘర్షణలు చెలరేగితే రాష్ట్రపతి పాలన పెట్టిందని గుర్తు చేశారు. ఆ తరువాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టి అక్కడ ఏకాభిప్రాయం రాకపోతే.. జస్టిస్ షా కమీషన్ వేశారని దాని తరువాత పలు చర్చలు, సమావేశాలు, వాదోపవాదాల తరువాత పంజాబ్ రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. అంతిమ నిర్ణయం శాసనసభ అభిప్రాయం ప్రకారం జరిగిందని ఆయన అన్నారు.
ఆ తరువాత ఏర్పడిన ఛత్తీసగఢ్, జార్ఖాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు శాసనసభ ఆమోదంతోనే ఏర్పడ్డాయని గుర్తు చేశారు. పూంచ్ కమీషన్ మహరాష్ట్ర విభజనను ఒప్పుకోలేదని ఆయన అన్నారు. బాషా ప్రయుక్త రాష్ట్రల ఏర్పాటును ఎస్సార్సీ ఒప్పుకున్నప్పటికీ.. శాసనసభ ఒప్పుకోని కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఒప్పుకోవడం లేదని అద్వానీ అన్నారని గుర్తు చేశారు. భారత దేశంలో అందరికీ ఒకే హక్కులు ఉన్నప్పుడు తమకెందుకు అవి వర్తింపజేయరని ఆయన ప్రశ్నించారు. మేమంటే నిర్లక్ష్యమా? లేక మేము దిగువశ్రేణి పౌరులమా? అని ఆయన ప్రశ్నించారు.