: అధికారమా? ప్రజా శ్రేయస్సా... ఏది ముఖ్యం?: జేపీ
విభజన అంటూ అధికారం కోసం పోరాడుతున్నామా? లేక ప్రజా శ్రేయస్సు కోసమా?.. ఏది ముఖ్యమని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రశ్నించారు. శాసన సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా వైషమ్యాలను ప్రక్కన పెట్టి తెలుగు ప్రజల అభివృద్ధికి పాటుపడదామని పిలుపునిచ్చారు. అధికార లాలసతో.. సాటి తెలుగు వారు నాశనమైపోవాలని కోరుకుందామా? అని ప్రజా ప్రతినిధులను ఆయన నిలదీశారు. మన కంటే చిన్న రాష్ట్రాలు బాగుపడుతుంటే.. అభివృద్ధి సాధించడానికి మనకేంటి సమస్య? అంటూ వారిని జేపీ ప్రశ్నించారు. ఉత్తర భారతంలో తప్ప దక్షిణ భారతదేశంలో పన్ను రాయితీలు లేవని తెలిపారు.
రాయితీల కోసం, ఆర్థిక ఎదుగుదల కోసం తెలుగు వారంతా మూకుమ్మడిగా పోరాడాలని ఆయన సూచించారు. విద్వేషాలు, ఆందోళనలు, రాజకీయ ఎత్తుగడలు, వైషమ్యాల స్థానంలో తెలుగు ప్రజలంతా కలసి కేంద్రంపై పోరాడాలని ఆయన సూచించారు. తెలుగు నేలమీద పెట్టుబడులు పెరిగేందుకు, రాయితీలు వచ్చేందుకు రాజకీయ నేతలు పోరాడాలని ఆయన సూచించారు. తెలుగు నేల కోసం, భారత్ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని జేపీ స్పష్టం చేశారు.