: అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే.. పార్లమెంటుకు అధికారం: జేపీ
అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పార్లమెంటుకు అధికారం ఉంటుందని, రాష్ట్రం నుంచి ముందుగా తీర్మానం వచ్చిన తరువాతే రాష్ట్రాల ఏర్పాటు చేయాలని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ (జేపీ) అన్నారు. పంజాబ్ లో మాత్రమే తమకు రాష్ట్రం కావాలని వారు అడిగితే.. కేంద్రం వద్దని చెప్పింది. అలాగే హర్యానా వాసులు కూడా అదే విధంగా అభ్యర్థించారని, అందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని జేపీ గుర్తు చేశారు. అందులో ఇందిరాగాంధీ, వైబీ చవాన్ లు సభ్యులుగా ఉన్నారని, 120 మందితో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇచ్చారని ఆయన చెప్పారు. నివేదిక అందిన అనంతరం, పంజాబ్ రాష్ట్ర శాసనసభలో జరిగిన తీర్మానం కనబడదు కానీ ప్రక్రియ మాత్రం సావధానంగానే జరిగిందని ఆయన అసెంబ్లీ సభ్యులకు తెలిపారు.
సమాజంలో విభజన అంశం ప్రజల మధ్య వైష్యమ్యాలను పెంచేదిగా ఉండకూడదని జేపీ అన్నారు. విభజన ప్రక్రియలో కేంద్రం తీరు ఎలా ఉండకూడదో.. సరిగ్గా అలాగే కేంద్రం తీరు ఉందని ఆయన కేంద్రప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి కానీ అది బలవంతంగా జరగకూడదని ఆయన అన్నారు. అందర్నీ ఒప్పించిన తరువాతనే రాష్ట్ర విభజన చేయాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఏ రాష్ట్ర విభజన విషయంలో అయినా కేంద్రం నచ్చినట్టు చేయాలంటే సమాఖ్య వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుందని, కనుక కేంద్రం నిర్ణయాన్ని ఎవరూ ఒప్పుకోవద్దని ఆయన సభ్యులకు సూచించారు. ఒకవేళ అలా జరిగినట్లయితే.. ఆ అంశం ఎవరిదో ఒకరి తల తీసేస్తుందని జేపీ హెచ్చరించారు.