: తెలుగునేల కన్నీరు పెడుతోంది: జేపీ
ఈనాడు తెలుగు నేల కన్నీరు పెడుతోందని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, విభజన నిర్ణయంతో కలత చెందని హృదయం లేదని అన్నారు. తన బాల్యం మహారాష్ట్రలో గడిస్తే, విద్యాభ్యాసం కోస్తాంధ్రలో గడిచిందని, ఎన్నిక హైదరాబాద్ నుంచి అయితే నేను ఎవర్ని? ఏ ప్రాంతానికి చెందినవాడిగా చలామణి అవుతాను? అని ప్రశ్నించారు. ప్రతి మనిషికి, కులం, మతం, ప్రాంతం, జాతీయత అవసరం అని జేపీ అన్నారు.
పౌర సమాజంలో చలామణి కావాలంటే కొన్ని వనరులు కావాలి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో రెండు రకాల సమాజాల మధ్య అంతరం ఏర్పడింది. ఇప్పుడు నెలకొన్న సమస్య ప్రజల సమస్య కాదు. రాజకీయ సమస్య అన్నారు. గత 57 ఏళ్లుగా ఈ అంశంపై ప్రజలను సమన్వయం చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించాయి. పెద్దమనుషులు 7 అంశాలపై ఒప్పందం కుదిరింది. అందులో 5 అంశాలు అమలు జరిగాయి. రెండు అంశాలపై సమస్యలు వచ్చాయి.
ఖర్చులు కూడా సమానంగానే అయ్యాయి. హైదరాబాద్ ఉన్న కారణంగా తెలంగాణ ప్రాంతంలో కాస్త ఎక్కువ ఖర్చు అయిందని అన్నారు. సాంకేతిక విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో 30 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని జేపీ అన్నారు. 70వ దశకంలో పాఠశాల విద్యకు విశేష కృషి చేశారని, కానీ అప్పటికే పాఠశాల విద్య పెద్దగా ఆదరణకు నోచుకోలేదని ఆయన తెలిపారు. రాజకీయ అధికారం విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయని.. వీటి కారణంగానే పొరపొచ్చాలు పెరిగాయని ఆయన చెప్పారు. 610 జీవో ఉల్లంఘనలు జరగడం వల్లే.. అపోహలు పెరిగి ప్రస్తుత సమస్య ఉత్పన్నమైందని ఆయన పేర్కొన్నారు.