: 'టైమ్' పత్రిక ఎడిటర్ గా ప్రవాస భారతీయుడు
ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'టైమ్' సంపాదకుడిగా ప్రవాస భారత పాత్రికేయుడు బాబీ ఘోష్ నియమితులయ్యారు. టైమ్ పత్రిక చరిత్రలో అమెరికాయేతర వ్యక్తి ఎడిటర్ గా నియామకం కావటం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ఆ పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ మార్తా నెల్సన్, మేనేజింగ్ ఎడిటర్ రిక్కి స్టెన్జల్ ఇవాళ వెల్లడించారు. నిన్న(శుక్రవారం) జరిగిన పత్రిక సర్వసభ్య సమావేశంలో బాబీని ఈ పదవిలో నియమించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
1998లో టైమ్ మేగజైన్ లో పాత్రికేయునిగా చేరిన బాబీ, అంచలంచెలుగా ఎదిగారని, అతని రచనా శైలీ, భాషా ప్రావీణ్యం, అంకిత భావం బాబీ ఉన్నతికి కారణమయ్యాయని నెల్సన్ అన్నారు. కాగా, ఇటీవల కాలంలో బాబీఘోష్ కలం నుంచి జాలువారిన సచిన్, అమీర్ ఖాన్, విశ్వనాధన్ ఆనంద్ పై కథనాలు విశేష ప్రాచుర్యాన్ని పొందాయి.