: ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరిదీ కాదు... ఎవరైనా రావచ్చు!: పవన్ కల్యాణ్
'రేయ్' ఆడియో వేడుకలో పవన్ కల్యాణ్ మాట్లాడడానికి మైక్ అందుకోగానే అభిమానులు క్లాప్స్ కొడుతూ కాస్సేపు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ "సాయి మా అక్క కొడుకు. ఎమ్బీఎ చదువుతూ, సినిమాల్లోకి వస్తానంటూ నా దగ్గరకి వచ్చాడు. కృషి, ప్యాషన్, నిజాయతీ వుంటే సక్సెస్ అవుతావని చెప్పాను. సాయిని నేనేమీ రికమెండ్ చేయలేదు. ఈ సినిమాకు సంబంధించి నేనేమీ ఎక్కువగా చేయలేదు కూడా. సాయిని నాకు తెలిసిన వ్యక్తుల వద్దకు పంపాను ట్రైనింగ్ కి. కష్టపడితే అభిమానుల ఆదరణ పొందుతాడు.
చౌదరిగారు అసిస్టంట్ డైరెక్టర్ గా తెలుసు. దేవదాస్ సినిమా చేస్తున్నప్పుడు చూశాను. ఆయనలోని మొండి పట్టుదల నాకు నచ్చింది. మానసికంగా సపోర్ట్ చేశాను. అంతే ... అంతకు మించి ఏమీ చేయలేదు. చక్రిగారి మ్యూజిక్ ఇష్టం. సినిమాల్లోకి ఎవరొచ్చినా కష్టపడితే సక్సెస్ అవుతారు. ఈ పరిశ్రమ ఏ ఒక్కరిదీ కాదు. మా కుటుంబానిది కూడా కాదు. ఎవరైనా రావచ్చు. కొత్తవాళ్ళు రావాలి. నాకు కొత్తదనం ఇష్టం. అందుకే, స్వాగతం పలుకుతున్నాను" అన్నాడు. ఈ వేడుకలో దర్శక నిర్మాత వైవీయస్ చౌదరి పవన్ కల్యాణ్ ని అడిగి మరీ ఆలింగనం చేసుకున్నాడు.