: మన్మోహన్ పాలనలో భారత్ ఆర్థిక శక్తిగా ఎదిగింది: రాహుల్
న్యూఢిల్లీలో జరుగుతోన్న ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, యువనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ లో ఒక సైనికుడిగా పనిచేయడం తన అదృష్టమని ఆయన అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనలో భారత్ ఆర్థిక శక్తిగా ఎదిగిందని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని ఆయన చెప్పారు. బలమైన సమాచార హక్కు చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్సే నంటూ రాహుల్ స్పష్టం చేశారు. దేశాన్ని సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని యువనేత చెప్పుకొచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోందని ఆయన అన్నారు. లోక్ పాల్ బిల్లు గురించి అన్ని పార్టీల వారు మాట్లాడారని, కానీ బలమైన లోక్ పాల్ బిల్లును పాస్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు.