: తెలంగాణవాదానికి మొదట బీజం వేసింది వైయస్సే: కేటీఆర్
టీఆర్ఎస్ పుట్టకముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం వేసింది దివంగత రాజశేఖర్ రెడ్డే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. 42 మందితో కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వినతి పత్రం ఇప్పించింది వైయస్సే అని అన్నారు. తమతోనే తెలంగాణ వస్తుందని వైయస్ ఒకటికి పదిసార్లు చెప్పారని గుర్తుచేశారు. వైయస్ కల ఇప్పుడు నెరవేరుతున్నందుకు వైఎస్సార్సీపీ సంతోషించాలని అన్నారు. ఓటింగ్ పేరుతో వైఎస్సార్సీపీ డ్రామాలు చేస్తోందని విమర్శించారు.
అధికారం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఇస్తారనే నమ్మకంతోనే ఆనాడు కాంగ్రెస్ తో తాము పొత్తుపెట్టుకున్నామని చెప్పారు. విజయమ్మ వ్యాఖ్యలు అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠ అని తెలిపారు. ఆర్టికల్-3 గురించి తెలిపింది వైకాపా అధ్యక్షుడు జగనే అని చెప్పారు. టీబిల్లుపై ఓటింగ్ అవసరం లేదని... అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని కోరారు. లేని అధికారాలను శాసనసభకు ఆపాదించొద్దని కోరారు.