: జగన్ మ్యాచ్ ఫిక్సింగ్ నాకు, మేకపాటికే తెలుసు: సబ్బం హరి
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనకాపల్లి ఎంపీ సబ్బంహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు మద్దతు ఇస్తానని జగన్ ఒక సందర్భంలో చెప్పారన్నారు. అయితే, ఏ పరిస్థితుల్లో జగన్ యూపీఏ కు మద్దతిస్తానన్నది తనకు, మేకపాటికే తెలుసన్నారు. ఇదే సందర్భంలో జగన్ కు, తనకు మధ్య ఏ కారణాల వల్ల పొరపొచ్చాలు వచ్చాయో సబ్బం విశాఖలో మీడియాకు వివరించారు.
జగన్ కు తాను పాత మిత్రుడినో, కాదో తనకు తెలియదన్న ఆయన.. శోభా నాగిరెడ్డి ఒకరోజు తనపై మాట్లాడిన దగ్గర్నుంచీ జగన్ తనతో మాట్లాడటం లేదని వివరించారు. అయితే, తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయను కాబట్టే, జగన్ పై వెంటనే మాట్లాడలేదని.. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టే మాట్లాడుతున్నానన్నారు.
తాను తన సలహాదారుడినని ఒక సందర్భంలో జగనే చెప్పారని సబ్బం గుర్తు చేశారు. తనతో 130 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎంపీలు ఉన్నారని తనతో జగన్ చెప్పాడని, చివరికి ఆయనతో 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలే మిగిలారన్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగా జైలుకు వెళ్లాల్సి వస్తుందని, ఆర్ధిక నేరాలు విడిచిపెట్టమని జగన్ కు ఏనాడో చెప్పానన్నారు. ఆస్తుల వివరాలు బయటకు లాగితే ఇబ్బంది పడాల్సి వస్తుందని కూడా బాగా వివరించానన్నారు. కాంగ్రెస్ లో ఉంటే శక్తిగా ఉంటావని.. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు పడతావనీ చెప్పానన్నారు. ఒకానొక దశలో ఓడరేవుల మంత్రిత్వ శాఖ తీసుకోవడానికి జగన్ సిద్ధపడ్డాడని వెల్లడించిన సబ్బం.. జగన్ పై ఉన్న నేరాభియోగాలు, నివేదికలు చూసి అధిష్ఠానం మంత్రి పదవి ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న సాక్షి పత్రికను కుక్కలు కూడా చూడవని జగన్ తో చెప్పానన్నారు.