: బిల్లుతో కరెంట్ 'షాక్' కొట్టింది!
సర్కారీ వరుసవడ్డింపులతో కరెంటు వినియోగదారులకు ఓపక్క మతిపోతుంటే,
పిడుగుపాటులాంటి తాజాబిల్లు చూసి ఆ సగటు వినియోగదారుని గుండె గుభేలుమంది.
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఉద్యోగుల నిర్వాకం
దీనికి కారణమైంది. వివరాల్లోకి వెళితే, చంద్రపేటకు చెందిన రమేష్ ఇంటి మీటర్
సర్వీస్ నెం.1010301035కి సాధారణంగా 300 నుంచి 350 మధ్య బిల్లు వస్తుంది.
అయితే ఫిబ్రవరిలో రూ. 4,82,318 బిల్లు వస్తే ... తాజాగా మార్చిలో వచ్చిన బిల్లు అక్షరాలా రూ.9,65,098. దీంతో
ఠారెత్తిపోయిన సదరు బాధితుడు లబోదిబోమంటున్నాడు. జనవరి నెలలో ఇదే మీటర్ కు
రూ.373 బిల్లు రావటం ఇక్కడ గమనార్హం.
కాగా, ఫిబ్రవరిలో తప్పుగా వచ్చిన 4,82,318 బిల్లు గురించి సదరు
అధికారులకు ఫిర్యాదు చేశానని, అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోకుండా ఇప్పుడు
9లక్షల పైచిలుకు బిల్లు ఇచ్చి తనకు మానసికవేదనను కల్గిస్తున్నారని రమేష్
వాపోతున్నారు. ఈ ఘటనమీద ఎండీ యూనస్ స్పందిస్తూ ఆన్ లైన్ లో పొరపాటు జరిగి
ఉంటుందని, దీనిపై తగిన చర్యలు తీసుకుని, వినియోగదారునికి న్యాయం చేస్తామని
హామీ ఇచ్చారు.