: పరిస్థితి ఇలాగే కొనసాగితే టీటీడీ అధికారులు తన్నులు తింటారు: హీరో శివాజీ
భక్తులపై కేసులు పెట్టే అధికారం టీటీడీ అధికారులకు ఎవరిచ్చారని సినీ హీరో శివాజీ ప్రశ్నించారు. వెంటనే భక్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భక్తులే వీరిపై పడి కొడతారని హెచ్చరించారు. అంతవరకు పరిస్థితిని తెచ్చుకోరాదని ఛైర్మన్, ఈవో, అధికారులకు సూచించారు. ఒకే రోజు 9 వేల వీఐపీ పాసులను కేటాయించడంపై శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా స్వామి వారిని దర్శించుకుందామని వచ్చే భక్తులకు కొండపై ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎమర్జన్సీలో కేసులు పెట్టినట్టు భక్తులపై కేసులు పెట్టడమేమిటని... ఛైర్మన్, ఈవోలపైనే కేసులు పెట్టాలని కోరారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు కూడా ఇలా చేస్తే ఎలాగని ప్రశ్నించారు. గవర్నర్ నరసింహన్ కూడా టీటీడీ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. కొండపైన రాజకీయాలు చేస్తే శిక్షించాలని అన్నారు.
వీఐపీలు ఎక్కువగా వస్తున్నారనే సమాచారం ముందస్తుగానే ఇస్తే... ఆ రోజు భక్తులు తక్కువగా వస్తారు కదా? అని శివాజీ ప్రశ్నించారు. స్వామికి వచ్చే రోజువారీ కోట్ల రూపాయల ఆదాయం సామాన్యుల నుంచే వస్తుందని... వీఐపీల నుంచి కాదని అన్నారు. తిరుమల కొండకు వీఐపీ కొండ అని పేరు పెడితే,సామాన్యులు రాకుండా ఉంటారని... అప్పుడు వీఐపీల సేవలో మరింతగా తరించవచ్చని ఎద్దేవా చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకుంటే మంచిదనే భక్తులందరూ వస్తారని తెలిపారు. గత ఏడాది కూడా తాను ఇదే విషయంపై మాట్లాడానని... అయితే తనను వీఐపీగా ట్రీట్ చేయనందుకే శివాజీ అలా మాట్లాడారని టీటీడీ అధికారులు అన్నారని... తాను వీఐపీని కాదని సామాన్య భక్తుడినని చెప్పారు. కొండ మీద వీఐపీలు ఎవరూ ఉండరని... కేవలం స్వామి మాత్రమే వీఐపీఅని అన్నారు. వీఐపీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించకూడదని తాను చెప్పడం లేదని... సామాన్యులను కూడా పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.