: బుద్ధుడు ఉపయోగించిన భిక్షాపాత్ర కాబూల్ లో ఉందా?
బుద్ధుడు ఉపయోగించిన భిక్షాపాత్రగా భావిస్తున్న ఒక పాత్ర ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ లో ఉందని భారత పురావస్తు శాఖ భావిస్తోంది. దీంతో అది ఎంతవరకూ వాస్తవమో పరిశీలించి, దానిని భారత్ తీసుకువచ్చేందుకు ఈ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికిగాను ఇద్దరు నిపుణులు కాబూల్ వెళ్లనున్నారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో ఆర్జేడీ ఎంపీ రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఈ విషయాన్ని లోక్ సభలో ప్రస్తావించారు. బుద్ధుడు పరినిర్వాణానికి కుశినగర్ వెళ్లేముందు ఆ పాత్రను వైశాలి వాసులకు కానుకగా ఇచ్చాడని, చరిత్ర ద్వారా తెలుస్తోందని, కాబట్టి దాన్ని తిరిగి వైశాలి తెప్పించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఇక అప్పటినుంచి పురావస్తుశాఖ కాబూల్ లోని భారత దౌత్య కార్యాలయం ద్వారా సమాచారాన్ని సేకరించింది. ఇటీవల ఎంపీ రఘువంశ్, పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ తో జరిపిన భేటీలో ఈ పాత్ర బుద్ధుడు ఉపయోగించినదో, కాదో తెలుసుకోవడానికి ఒక నిపుణుల బృందాన్ని కాబుల్ పంపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒకవేళ అది నిజమేనని తేలితే దాన్ని భారత్ తీసుకువచ్చేందుకు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో మన అధికారులు సంప్రదింపులు జరపనున్నారు. 5.7 అడుగుల ఎత్తు 350 కిలోల బరువున్న ఈ రాతి పాత్ర పలువురి చేతులు మారిందని చరిత్రకారులు తెలిపారు. ముస్లిం ప్రభువుల పాలనలో ఈ పాత్రపై అరబిక్ భాషలో ఏదో సందేశం కూడా చెక్కారని వీరు చెబుతున్నారు.