: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటిపై వివాదం
పశ్చిమబెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి చెందిన భవనాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిన్న పునరుద్ధరించడానికి పూనుకోవడంతో వివాదానికి దారి తీసింది. ఆయన తల్లి ప్రభావతి బోస్ ఈ ఆస్తిని తన ఏడుగురు కుమారులకు రాసిచ్చారు. అయితే ఈ ఇంట్లో నేతాజీ ఒక్క రోజు కూడా గడిపిన ఆధారాలు లేవు. దీంతో 'ఆయన ప్రారంభించిన ఇండియన్ నేషనల్ ఆర్మీతో దీనికి సంబంధం ఏమిటి? ఇది పూర్తిగా ప్రైవేటు ఆస్తి, మా అనుమతి లేకుండా మా ఇంట్లోకి ప్రభుత్వం ఎలా ప్రవేశిస్తుంది ?' అంటూ నేతాజీ కుటుంబ ప్రతినిధి చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ భవనాన్ని 150 ఏళ్ల క్రితం నేతాజీ తాతగారు కట్టారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వం ప్రహరీగోడ నిర్మాణం చేపట్టిందని తెలిపిన ఆయన, దీనిపై తాము హైకోర్టుకు వెళతామన్నారు. ఇప్పటికే ఎల్జిన్ రోడ్ లోని ఆయన తండ్రి నివాసాన్ని నేతాజీ భవన్ గా ప్రభుత్వం మార్చిందని చంద్రబోస్ అన్నారు. అయితే రాష్ట్ర హెరిటేజ్ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ, నేతాజీ గుర్తుగా ముందుతరాలవారు ఈ భవనాన్ని చూసేందుకు మరమ్మత్తులు చేపట్టామే తప్ప దాన్ని ప్రభుత్వం సొంతం చేసుకునే ఆలోచన లేదని తెలిపారు.