: పొట్టలో అరకిలో వెంట్రుకల గుట్ట!
చిన్న పిల్లలు సాధారణంగా మట్టి, బలపాలు, చాక్ పీసులు లాంటివి తినడం సహజమే. కానీ, చైనాలోని 12 ఏళ్ల బాలిక ఇవేమీ కాకుండా వెంట్రుకలను తినడం అలవాటు చేసుకుంది. దీంతో గత కొంతకాలంగా బాలికలో ఎదుగుదల లోపించింది. దీన్ని గమనించిన బాలిక తల్లి చైనాలోని లోయాంగ్ లో ఉన్న హేనాన్ వర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైద్యులను కలిసి పరిస్థితిని వివరించింది. వైద్యులు సీటీ స్కాన్ చేయగా, బాలిక పొట్టలోని 70 శాతం భాగాన్ని వెంట్రుకలు గుట్టలా చుట్టుకుని ఉన్నట్టు గమనించారు. దీంతో ఈ నెల 11 న శస్త్ర చికిత్స చేసి, ఆ వెంట్రుకల గుట్టను వైద్యులు వెలికి తీశారు. దీని బరువు సుమారు అరకిలో పైనే ఉన్నట్టు వారు తెలియజేశారు. ఈ బాలిక 'పికా' అనే వ్యాధితో బాధపడుతోందని, దీని బారిన పడ్డవారు బలపాలు, చాక్ పీసులు తదితర వస్తువులను తినేందుకు అమితంగా ఇష్టపడతారని వైద్యులు తెలిపారు.