: ప్రకటనలతో తప్పుదోవ పట్టించిన ఎల్ఐసీకి నోటీసులు
ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)కు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్ డీఏ) నోటీసులు జారీ చేసింది. పాలసీలకు సంబంధించి ఐఆర్ డీఏ కొత్త నిబంధనలను జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఎల్ఐసీ పాలసీల్లో మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా.. డిసెంబర్ 31తో 34 పాలసీలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో.. అభిమాన పాలసీలను కొనుగోలు చేయడానికి చివరి అవకాశం ఇదేనంటూ ఎల్ఐసీ డిసెంబర్ లో మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించింది.
నిజానికి పాలసీదారులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేందుకు పాత వాటి స్థానంలో కొత్త నిబంధనలను ఐఆర్ డీఏ అమల్లోకి తీసుకొచ్చింది. అంటే పాత పాలసీల కంటే కొత్త మార్గదర్శకాలతో వచ్చే పాలసీలే మరింత ప్రయోజనకరం. కానీ, ఎల్ఐసీ మాత్రం పాత పాలసీలను అమ్ముకుని లాభాలు గడించేందుకు అలా ప్రకటనలు ఇవ్వడాన్ని ఐఆర్ డీఏ తీవ్రంగా పరిగణించింది. తప్పుదోవ పట్టించినందుకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వడానికి నెల రోజుల సమయం ఇచ్చింది.