: చెప్పులు విసురుకున్న కోమటిరెడ్డి, దామోదరరెడ్డి వర్గీయులు.. పరిస్థితి ఉద్రిక్తం
నల్గొండ జిల్లా భువనగిరిలో అభ్యర్థుల ఎంపిక కోసం చేపట్టిన అభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. సాక్షాత్తూ రాహుల్ గాంధీ దూత, ఏఐసీసీ పరిశీలకుడు వాగ్రే సమక్షంలో ఇరుపక్షాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసురుకున్నారు. చెప్పులతో కొట్టుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వాగ్రే అభిప్రాయాలను సేకరిస్తున్న సమయంలో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అతని ప్రత్యర్థి ఎమ్మెల్యే దామోదర రెడ్డి వర్గీయులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.
ఈ ఘటనలో పలువురు కార్యకర్తలతో పాటు, ఒక కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో, పోలీసులు స్పల్ప లాఠీఛార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం, అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని వాగ్రే ముగించారు. అయితే, దామోదరరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధర్నాకు దిగారు. భువనగిరిలో ప్రస్తుతం ఉద్రిక్తకర పరిస్థితి నెలకొంది.