: ఆమ్ ఆద్మీ ప్రభ వెనుక కాంగ్రెస్ హస్తం?


ఒక్కసారిగా ఆమ్ ఆద్మీకి దేశవ్యాప్తంగా ఎందుకింతగా ప్రచారం, పేరు..? ఎలా సాధ్యం..? ఆ పార్టీలో ఉన్నది పేరు మోసిన నేతలు కాదు.. వారి దగ్గర అంత ధన బలం కూడా లేదు. కానీ, ఢిల్లీలో అధికారం సొంతం చేసుకుంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై గురిపెట్టింది. ఢిల్లీ సీఎం పీఠం ఎక్కిన.. మాజీ ఐటీ అధికారి కేజ్రీవాల్ ఇక ప్రధాని పదవిని అధిష్టించడమే ఆలస్యమంటూ ఆ పార్టీ నేతలు ప్రకటనలు ఇస్తున్నారు.. నిజంగా వారికంత విశ్వాసం, బలం ఎక్కడివి..? ఇప్పటి వరకూ స్వతంత్ర భారతంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేనివి ఇప్పుడు ఆమ్ ఆద్మీతో సాధ్యమని ప్రజలు నిజంగా విశ్వసిస్తున్నారా? ఎన్నో ప్రశ్నలను ఒక్కసారి మననం చేసుకోవాల్సి ఉంది.

ఇక్కడ కొన్ని వాదనలు ఉన్నాయి. ఒక్కో అంశానికి ఎన్నో కోణాలు ఉన్నట్లు, ఆమ్ ఆద్మీ ప్రభ వెనుక అలాంటివే ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజల కోసం, వారి సేవ కోసం, మార్పు కోసమంటూ వచ్చిన ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి ఏమైంది? ఎన్టీఆర్ తర్వాత అంతటి అసంఖ్యాక అభిమాన బలిమి ఉన్న చిరంజీవికి ప్రజలు ఎందుకు అధికారం కట్టబెట్టలేదు..? మార్పు తీసుకొస్తాను.. అంటూ ఆయన సాగించిన ప్రచారానికి భారీగా జనం తరలివచ్చారు. ఆయన ఎక్కడికెళ్లినా రోడ్లు, మైదానాలు అభిమానులు, ప్రజలతో కిక్కిరిసిపోయాయి. కానీ, 294 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 18 చోట్ల మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు.

మరి ఏ మాత్రం ప్రజాభిమానం లేని, పెద్దగా ప్రజలకు పరిచయం లేని కేజ్రీవాల్ ను ఢిల్లీ ప్రజలు ఎందుకు నెత్తిన పెట్టుకున్నారు? విశ్లేషకుల వివరణ ప్రకారం.. దీనికి ప్రధాన కారణం జాతీయ మీడియా. ఇంగ్లిష్, హిందీ పత్రికలు, చానళ్లు ఆమ్ ఆద్మీ పార్టీకి విశేష, సానుకూల ప్రచారాన్ని కల్పించాయి. చివరి వరకూ మీడియా యథాశక్తి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుకు దోహదపడింది. అందుకే ప్రజల్లో కేజ్రీ మంత్రదండమనే హైప్ ఏర్పడింది. ఓట్లు గుద్దేశారు. కానీ, ఢిల్లీ ప్రజలందరూ మీడియా మాయలో పడలేదు. నిజానికి అక్కడి 60 అసెంబ్లీ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకున్నది కేవలం 28 మాత్రమే. నిజంగా ఢిల్లీ ప్రజలు అందరూ ఆమ్ ఆద్మీని విశ్వసిస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో గద్దెనెక్కించి ఉండేవారు. కానీ అది జరగలేదు. కాంగ్రెస్ పెద్ద మనసు (అందులో కిటుకు ఉంది)తో మద్దతిచ్చి కేజ్రీని గద్దెపై కూర్చోబెట్టింది. ఇందులో కాంగ్రెస్ మాయోపాయం వేరే ఉందన్నది విశ్లేషణ.

నిజానికి కాంగ్రెస్ ను ఢిల్లీ ప్రజలు ఛీ కొట్టారు. అధికారం నుంచి సాగనంపారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు అవినీతిపైనే కేజ్రీవాల్ ప్రధానంగా పోరు సాగించారు. గత పదేళ్లుగా బీజేపీ అధికారానికి దూరంగానే ఉంది. మరి చిత్రంగా కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతో ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు? ఏ పార్టీతో పొత్తు లేదని కుండబద్దలయ్యేలా చెప్పిన కేజ్రీవాల్... అవినీతి మచ్చపడ్డ కాంగ్రెస్ మద్దతు ఎందుకు తీసుకున్నారు?

నిజానికి యూపీఏ 10 ఏళ్ల పాలనలో దేశంలో సామాన్య, మధ్యతరగతి ప్రజల బతుకులు చిధ్రమయ్యాయి. ఎంత సంపాదించినా.. ఇల్లు గడవలేని, అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అదే సమయంలో సమర్థుడైన నరేంద్రమోడీ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. నరేంద్ర మోడీ పాలనాదక్షతను దేశ, విదేశీ మీడియా కూడా ప్రస్తుతించింది. దీంతో మోడీకి దేశవ్యాప్తంగా ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. ఇది కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ వేసిన అంచనాలో మోడీ సారథ్యంలో ఎన్డీయేకు 200 నుంచి 250 స్థానాలు రావచ్చని తేలింది. ఒక్కసారి మోడీ గద్దెనెక్కితే మళ్లీ దేశంలో ఎన్నేళ్లు అధికారానికి దూరంగా ఉండాలోనన్న భయం కాంగ్రెస్ నేతల్లో కలిగింది. ప్రస్తుతం గుజరాత్ లో ఆ పార్టీ పరిస్థితి అదే కదా. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు కేజ్రీ ఒక ఆయుధంగా కనిపించారు. మోడీకి యువత, విద్యావంతుల్లో విశేష ఆదరణ లభిస్తోంది. కేజ్రీని కూడా అదే వర్గంలో ఆదరణనీయుడిగా మార్చి మోడీపై ఆయుధంగా వచ్చే ఎన్నికల్లో సంధించాలని కాంగ్రెస్ వ్యూహంగా చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా జాతీయ ఇంగ్లిష్ మీడియాను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. అందులో భాగంగా కేజ్రీపై చోటామోటా ప్రాంతీయ పత్రికల నుంచి పెద్ద పెద్ద పత్రికలు, టీవీల్లోనూ కథనాలు మార్మోగుతున్నాయి.

బ్రిటిష్ వారి నుంచి నేర్చుకున్న విభజించు పాలించు సూత్రంతో బీజేపీ ఓటు బ్యాంకును ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా చీలిస్తే.. అది తమకు అనుకూలిస్తుందని, అంతిమంగా మరోసారి ఢిల్లీలో అధికారం సాధ్యమవుతుందని.. యువరాజు రాహుల్ ను ప్రధానిని చేయవచ్చని కాంగ్రెస్ ప్రణాళిక. తమకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీలను అక్కున చేర్చుకుని కలుపుకోవడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య. నాడు పీఆర్పీ.. రేపు ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు కావచ్చు.. కాకపోవచ్చు. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ ప్రచారం కల్పిస్తోందని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మెదలైంది.

మోడీ ప్రభావాన్ని అడ్డుకోవడానికి రాహుల్ చరిష్మా చాలదని.. అందుకు కేజ్రీయే సరైన అస్త్రమని హస్తం ఆశ!. ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ పై అన్నా హజారేకు అంత విశ్వసనీయత ఎందుకు లేదు? అన్న ప్రశ్నను కూడా ఇక్కడ వేసుకోవాలి. కేజ్రీ చెప్పే మాటలు, వేసే అడుగులు పరిశుద్ధమైనవైతే.. ఆయన గురువైన హజారే ఆయనకు ఎందుకు దూరంగా ఉన్నారు?

  • Loading...

More Telugu News