: టీబిల్లును దగ్ధం చేయడం.. తెలంగాణ వారిని అవమానించడమే: గుత్తా
టీబిల్లు ప్రతులను సీమాంధ్రులు భోగి మంటల్లో తగులబెట్టడం... తెలంగాణ వారిని అవమానపరచడమే అని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే సామర్థ్యం ఎవరికీ లేదని గుత్తా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాను ఎంపీగానే పోటీచేస్తానని స్పష్టం చేశారు. జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తనను ఎంపీగానే పోటీ చేయమని కోరుతున్నారని చెప్పారు. సీమాంధ్ర నేతలపై కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్ర నేతలు మండిపడటాన్ని గుత్తా తప్పుబట్టారు. శుంఠ అంటే బూతు పదం కాదని... దానిపై రాద్ధాంతం చేయడం సబబు కాదని అన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.