: కాసేపైనా వ్యాయామం చేయాలట
ఇంట్లో వంటపని, పిల్లలకు క్యారియర్లు సర్దడం, శ్రీవారికి అవసరమైనవి సమకూర్చి, చివరికి తాను ఆఫీసుకు బయలుదేరి వెళ్లేసరికి ఒంట్లో ఉన్న శక్తి మొత్తం హరించుకుపోయినట్టు నీరసంగా తయారయ్యే మగువలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి సమస్య కేవలం ఏ కొందరికో ఉండదు. చాలామంది ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. ఇలా నీరసంగా తయారవడానికి కారణం ఆడవాళ్లు తీసుకునే ఆహారమే ప్రధాన కారణం అని కొందరు చెబుతుంటారు. కానీ ఆహారమే కాకుండా శరీరానికి తగు వ్యాయామం లేకపోవడం కూడా దీనికొక కారణమని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఇంట్లోను, ఆఫీసులోను చేసే పని చాలకుండా ఇంకా వ్యాయామం చేసే సమయం కూడా తమకు ఎక్కడుందని వాపోయే ఆడవాళ్లు మనకు తారసపడుతుంటారు.
కానీ ఎలాగైనా ఒక అరగంట పాటు మగువలు నడక అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు ఒక అరగంటపాటు నడవడం, లేదా ఏరోబిక్స్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందట. అయితే ఇలా చేయడంతోబాటు తగు ఆహారం కూడా తీసుకోవాలట. ఇంకా నీరసం తగ్గాలంటే కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమపాళ్లలో ఉండేలా ఆహారం తీసుకోవాలి. అలాగే రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. కొందరు చలికాలంలో సరిగా నీరు తీసుకోరు. అలాకాకుండా చలికాలంలో అయినా నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడమే కాదు... రోజంతా చక్కగా ఉత్సాహంగా కూడా ఉండవచ్చు!