: రెండు రోగాలకు ఒకే మందు
మందు ఒకటే... కానీ అది రెండు రకాలైన రోగాలను నయం చేస్తుంది. ఈ విషయాన్ని పరిశోధకులు తాజా పరిశోధనలో కనుగొన్నారు. కేన్సర్ చికిత్సకు ఉపయోగించే ఒకరకమైన మందును షుగరు వ్యాధిని అదుపులో ఉంచడానికి కూడా ఉపయోగించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కేన్సర్ చికిత్సలో ఉపయోగించే ఒక రకమైన మందును తక్కువ మోతాదులో ఉపయోగించడం ద్వారా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలకు రక్షణ కల్పించవచ్చని తమ అధ్యయనంలో కనుగొన్నారు. ఈ మందు శరీరంలో రోగనిరోధక శక్తిని ప్రేరేపించి, టైప్ 2 మధుమేహం ఎదుగుదలను అడ్డుకుంటుందని ఈ పరిశోధనలో పాల్గొన్న క్రిస్టెన్సన్ చెబుతున్నారు. తాము ఎలుకలపై జరిపిన ప్రయోగంలో ఈ విషయాన్ని గమనించామని, టైప్ 2 మధుమేహాన్ని నిరోధించే చికిత్సను రూపొందించడానికి తాము కనుగొన్న ఈ విషయం ఎంతో ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని క్రిస్టెన్సన్ వ్యక్తం చేస్తున్నారు.