: ఇటలీ రాయబారి కోసం విమానాశ్రయాల అప్రమత్తం


అనుమతి లేకుండా భారత్ విడిచి వెళ్లరాదంటూ ఇటలీ రాయబారికి నిన్న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటలీ రాయబారి డానియేల్ మాన్సినీ, దేశం విడిచిపోయే అవకాశం ఉందని నిఘావర్గాల సమాచారంతో దానిని నివారించడానికి, దేశంలోని ముఖ్య విమానాశ్రయాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా విమానాశ్రయాల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. గతేడాది ఫిబ్రవరి 15న భారత జాలర్లను హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఇద్దరు ఇటలీ సైనికులను భారత్ కు తిరిగి పంపించడానికి ఇటలీ ప్రభుత్వం నిరాకరించటంతో సుప్రీంకోర్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

కాగా, ఇటలీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటామన్న నిందితుల విజ్ణప్తిని మన్నిస్తూ ఇటలీ రాయబారి పర్యవేక్షణలో వారిని స్వదేశం వెళ్లడానికి సర్వోన్నత న్యాయస్థానం గత నెల 22న అనుమతించిన సంగతి విదితమే. కోర్టు ఆదేశించినట్లుగా నాలుగువారాల్లోపు వారిని వెనక్కి పంపిస్తామని ఇటలీ రాయబారి హామీ ఇచ్చి తీసుకెళ్లారు. ఆపై ఇటలీ విదేశాంగ శాఖ, వారిని వెనక్కి పంపేదిలేదంటూ ఈ మేరకు ఈనెల 11న ఒక నోట్ పంపించటంతో ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్యా విభేదాలకు తావిచ్చింది.  

  • Loading...

More Telugu News