: దొంగతో పోరాడుతూ రైల్లోంచి జారిపడ్డ బాక్సర్
హ్యాండ్ బ్యాగ్ చోరీ చేసేందుకు ప్రయత్నించిన దొంగతో పోరాడుతూ వెళ్తున్న రైల్లోనుంచి పడిపోయి తీవ్రంగా గాయపడింది ఓ మహిళా బాక్సర్. బెనారస్ యూనివర్సిటీలో జరిగిన బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్న సిమ్రాన్ వర్మ ఢిల్లీ చేరుకునేందుకు ఫరక్కా ఎక్స్ ప్రెస్ ఎక్కింది. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాకు రైలు చేరుకోగానే ఓ దొంగ తన హ్యాండ్ బ్యాగ్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించాడు.
దీనిని గమనించిన సిమ్రాన్ అతడ్ని ఎదిరించింది. ఇద్దరూ పెనుగులాడగా ఫైజాబాద్ శివారులో ఆమె అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో ఆమె రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక చికిత్స చేయించిన పోలీసులు మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించారు. తన బ్యాగులో 30 వేల రూపాయలు ఉన్నాయని బాక్సర్ సిమ్రాన్ తెలిపింది.