: దేవయాని కథ సుఖాంతం.. భారత్ కు బదిలీ
దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగదే విషయంలో నెల రోజులుగా భారత్, అమెరికా మధ్య కొనసాగుతున్న దౌత్య యుద్ధం ప్రస్తుతానికి సుఖాంతం అయింది. దేవయానిని దౌత్యరక్షణతో భారత్ కు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, దేవయానిపై వీసా మోసం, తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గ్రాండ్ జ్యూరీ గురువారం అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో దేవయానిపై అభియోగాలు నిలిచే ఉంటాయని, దౌత్యరక్షణ లేకుండా ఆమె ఎప్పుడైనా అమెరికాకు తిరిగి వస్తే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అటార్నీ ప్రీత్ భరారా న్యూయార్క్ డిస్ట్రిక్ట్ జడ్జి షీరాషెండ్లిన్ కు లేఖ ఇచ్చారు.
దేవయానికి పూర్తి దౌత్యరక్షణనిచ్చే జీ1 వీసాను అమెరికా మంజూరు చేసిందని, దీంతో ఆమె భారత్ కు తిరిగి రానున్నారని భారత విదేశాంగ శాఖ కూడా ప్రకటన జారీ చేసింది. ఈ నెల 8న దేవయానికి దౌత్య ఒప్పందానికి అనుగుణంగా భారత్ దౌత్యరక్షణ కల్పించింది. దీన్ని ఎత్తివేయాలని అమెరికా కోరగా భారత్ తోసిపుచ్చింది. దీంతో దేవయానిని దౌత్యరక్షణ నడుమ భారత్ వెళ్లడానికి అనుమతించడం మినహా అమెరికాకు మరో మార్గం లేకపోయింది.
1999 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అధికారి అయిన దేవయాని న్యూయార్క్ లో భారత కాన్సులేట్ జనరల్ గా ఉండగా.. తన దగ్గర పనిచేసే పనిమనిషికి సంబంధించిన వీసా దరఖాస్తులో మోసానికి పాల్పడ్డారని, తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తూ.. గత నెల 12న ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఆమెను బట్టలువిప్పి తనిఖీ చేయడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. దౌత్యపరంగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. భారత్ లోని అమెరికా దౌత్య అధికారులకున్న రక్షణలను కొన్నింటిని తొలగించింది. అనంతరం ఆమెపై విచారణ జరగకుండా ఉండేందుకు న్యూయార్క్ లోనే ఐక్యరాజ్యసమితి మిషన్ కు బదిలీ చేసింది. కేసు ఉపసంహరించుకోవాలని భారత్ డిమాండ్ చేసినా అమెరికా అంగీకరించలేదు. వివాదం మరింత ముదరకుండా విషయం కొలిక్కిరావడంతో ఇరుదేశాల సంబంధాలు తిరిగి గాడిన పడడానికి అవకాశం ఉంటుంది.