: ముషారఫ్ ఆరోగ్యం నిక్షేపంలా ఉంది: పాక్ ప్రభుత్వ న్యాయవాది
దేశ ద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి నిక్షేపంలా ఉందని, అతని గుండె 18 ఏళ్ల కుర్రాడిలా పని చేస్తోందని ప్రభుత్వ న్యాయవాది అక్రమ్ సిఖ్ తెలిపారు. ముషారఫ్ కుటుంబ సభ్యులు కోరుతున్నట్టు ఆయన విదేశాల్లో వైద్యపరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటికే అన్ని సౌకర్యాలు ఉన్న సైనిక ఆసుపత్రిలో ఆయన ఉన్నారని, పాకిస్థాన్లో మరిన్ని మంచి ఆసుపత్రులు కూడా ఉన్నాయని, అవసరమైతే వాటిల్లో చూపించొచ్చని ఆయన స్పష్టం చేశారు. సైనిక ఆసుపత్రి వైద్యులు విడుదల చేసిన నివేదిక చూస్తే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తుందని ఆయన సూచించారు. కాగా ముషారఫ్ ఆరోగ్య పరిస్థితిపై అతని న్యాయవాది అహ్మద్ రాజా కసూరి మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు.