: కేన్సర్‌ను అడ్డుకునే దాల్చిన చెక్క
దాల్చిన చెక్కని మనం వంటకాల్లో వాడుతుంటాం. దీనివల్ల ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వంటకాలకు కమ్మటి సువాసనను అందించేందుకు కూడా ఈ చెక్క చక్కగా ఉపకరిస్తుంది. తాజాగా పరిశోధకులు దాల్చిన చెక్కతో కేన్సర్‌కు చెక్ చెప్పవచ్చని తమ పరిశోధనల్లో కనుగొన్నారు. మన రాష్ట్రంలోనే హైదరాబాద్‌లో మెహదీపట్నంలో బిఎస్సీ జెనెటిక్స్ చదువుతున్న విద్యార్ధులు నిర్వహించిన పరిశోధనలో దాల్చిన చెక్కలో కేన్సర్‌ను నయం చేసే గుణాలున్నట్టు వెల్లడైంది. జెహ్రా ఫాతిమా, బతుల్ షబ్బీర్‌లు నిర్వహించిన ఈ పరిశోధనలో వీరు దాల్చిన చెక్కలోని ఈ సుగుణాన్ని గుర్తించారు. తమ పరిశోధనకు సంబంధించి వీరు రూపొందించిన రీసెర్చ్ పేపర్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ గత ఏడాది డిసెంబరు సంచికలో ప్రచురితమైంది. తమ పరిశోధనకు తమ కళాశాల జెనెటిక్స్ విభాగానికి చెందిన అధిపతి వేణుగోపాల్ తమకు చక్కటి తోడ్పాటును అందించారని, తాము కేన్సర్ నివారణపై మరిన్ని పరిశోధనలు చేస్తామని, అలాగే లవంగాలపై కూడా రీసెర్చ్ చేస్తామని ఈ యువ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.