: కేజ్రీవాల్ సెక్యూరిటీని తిరస్కరించడంపై ఢిల్లీ హైకోర్టులో పిల్
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి భద్రతను తిరస్కరించిన సంగతి తెలిసిందే. దాంతో, ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. భద్రతను తిరస్కరించవద్దని కేజ్రీవాల్ కు సూచించాలని కోర్టును కోరారు. ఈ మేరకు న్యాయవాది అనూప్ అవస్థీ.. జస్టిస్ బీడీ అహ్మద్, జస్టిస్ సిద్ధార్థ్ మ్రిదుల్ ధర్మాసనం ముందు విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారంతో సరైన పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. ఈ సందర్భంగా మాట్లాడిన న్యాయవాది, ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ సీఎం భద్రతను తిరస్కరించి తనకు తాను ఫేమ్ అవుతూ.. తన క్యాబినెట్ మంత్రులను ప్రమాదంలో పడేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం, ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.